1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (08:25 IST)

దక్షిణ కోస్తాలో వర్షాలు

ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రా తీరంలో 3.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపారు.

దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, నెల్లూరు జిల్లాలో కొద్దిచోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

రాయలసీమలోని పలు చోట్ల రాగల 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర కోస్తాలో పొడివాతావరణం కొనసాగుతుందని వెల్లడించారు.
 
కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు..
రానున్న ఐదు రోజుల్లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) అంచనా వేసింది.

తమిళనాడు, కోస్తాంధ్రకు ఉత్తర దిశగా అల్పపీడనం నెలకొందని, ఈ ప్రభావంతో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని ఐఎండి గురువారం ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది.

వచ్చే 24 గంటల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా ఈనెల 30తో పాటు వచ్చే నెల 1,2 తేదీల్లో కూడా రాష్ట్రంలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని మరో ట్వీట్‌లో తెలిపింది. దేశంలోని వాయువ్యం, పశ్చిమం, తూర్పు, మధ్య ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని అభిప్రాయపడింది.