శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (17:56 IST)

చోరీ చేశాడనీ.. మర్మాంగాల్లో పెట్రోల్ పోసి హింసించారు.. ఎక్కడ?

రాజస్థాన్‌లో దొంగతనం చేశారనే ఆరోపణతో నెపంతో ఇద్దరు దళిత యువకులను కొందరు క్రూరంగా కొట్టారు. వాళ్ల మర్మాంగాల్లో పెట్రోల్ పోసి హింసించారు. ఈ మొత్తం వ్యవహారన్నంతా వీడియో కూడా తీశారు.
 
నాగౌర్ జిల్లాలోని కరణూ గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో దాడి వీడియో తాజాగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కూడా స్పందించారు. మరోవైపు దాడిని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలకు చెందిన వారు నాగౌర్‌లో నిరసన ప్రదర్శనలకు దిగారు.
 
ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకూ ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. బాధితులు విసారామ్, పన్నా రామ్‌లను వైద్య పరీక్షల కోసం పంపించినట్లు తెలిపారు. బాధితులిద్దరూ నాయక్ వర్గానికి చెందినవాళ్లు.
 
'జంతువుల పట్ల కూడా ఇంత హీనంగా ప్రవర్తించరు. మేం ధర్నా చేపట్టాం. అందరి మద్దతూ మాకు ఉంది. బాధితులకు న్యాయం జరిగే వరకూ మా పోరాటం కొనసాగుతుంది' అని నాయక్ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాకేశ్ నాయక్ అన్నారు.
 
ఫిబ్రవరి 16న తనకు సోదరుడి వరుసయ్యే పన్నారామ్‌తో కలిసి మోటార్ సైకిల్ సర్వీసింగ్ చేయించుకునేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లినట్లు విసారామ్ పోలీసులకు వివరించారు. కొంత సమయం తర్వాత తాము దొంగతనానికి పాల్పడ్డామని ఆరోపిస్తూ భీంవ్ సింగ్, అతడి సహచరులు తమను కొట్టడం మొదలుపెట్టారని పేర్కొన్నారు.
 
'మా మర్మాంగాల్లో పెట్రోల్ పోశారు. స్కూడ్రైవర్లతో గుచ్చారు' అని కూడా విసారామ్ తన ఫిర్యాదులో తెలిపారు. 'ఈ విషయమంతా రూ.100-200 దొంగతనం గురించి. గంటపాటు మమ్మల్ని కొట్టారు. మేం స్పృహ కోల్పోయేవరకూ వాళ్లు కొడుతూనే ఉన్నారు' అని పన్నారామ్ విలేకరులతో చెప్పారు.
 
బీబీసీతో మాట్లాడుతూ మత్తులో తాను రూ.100 దొంగిలించినట్లు విసారామ్ అంగీకరించారు. విసారామ్, పన్నా రామ్‌లది కరణూకు సమీపంలోని సోన్‌గర్ భోజావాస్‌ గ్రామం. దాడి చేసిన తర్వాత బాధితుల బంధువులకు నిందితులు ఫోన్ చేసి, వారిని తీసుకువెళ్లాలని చెప్పినట్లు స్థానికులు తెలిపారు.
 
పోలీసులను ఆశ్రయించలేదు
కరణూ గ్రామం పాంచౌరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ‘‘ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశాం. రిమాండ్‌ సమయంలో వారిని ప్రశ్నిస్తాం. బాధితులకు పూర్తి భద్రత కల్పించాం. ఘటన తర్వాత వాళ్లిద్దరూ భయపడిపోయి ఉన్నారు’’ అని పాంచౌరీ పోలీస్ స్టేషన్ అధికారి రాజ్‌పాల్ సింగ్ బీబీసీతో చెప్పారు.
 
బాధితులు తమను ఆశ్రయించలేదని, సోషల్ మీడియాలో వీడియోను చూసి కేసు నమోదు చేశామని వివరించారు. ఇటు యువకులపై దాడికి పాల్పడ్డవారు కూడా దొంగతనం కేసు పెట్టారని చెప్పారు. పాంచౌరీ పోలీస్ స్టేషన్ అధికారిని బదిలీ చేయాలని కొన్ని దళిత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
 
‘‘దళితులపై అకృత్యాల విషయమై నాగౌర్ జిల్లా ఇదివరకు కూడా వార్తల్లో నిలిచింది. 2015లో డంగావాస్ అనే గ్రామంలో ఓ వివాదం సమయంలో ఓ జన సమూహం ఐదుగురు యువకులను హత్య చేసింది. పోలీసులు ఈ కేసులో 40 మందిని అరెస్టు చేశారు’’ అని దళిత హక్కుల కోసం పోరాడుతున్న భంవర్ మేఘ్‌వంశీ బీబీసీతో చెప్పారు. ‘‘దళిత, పౌర హక్కుల సంస్థలు డంగావాస్‌పై సొంతంగా పోరాడాయి’’ అని అన్నారు. 
 
ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘దళిత యువకులపై జరిగిన ఈ క్రూర దాడి వీడియో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేరంలో పాలుపంచుకున్న వారిని చట్టపరంగా శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.
 
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ట్విటర్‌లో ఈ ఉదంతంపై స్పందించారు. ‘‘నాగౌర్‌లో జరిగిన ఘటన విషయంలో సత్వరమే చర్యలు తీసుకున్నాం. ఏడుగురి నిందితులను అరెస్టు చేశాం. దోషులను చట్ట ప్రకారం శిక్షిస్తాం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం’’ అని గెహ్లాట్ అన్నారు.