మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (09:12 IST)

ట్రిపుల్ తలాక్‌ గట్టెక్కేనా? నేడు రాజ్యసభకు...

వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఈనేపథ్యంలో బిల్లుపై తుది వైఖరిని వెల్లడించేందుకు కాంగ్రెస్ పార్టీ మిగతా విపక్షాలతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్న

వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఈనేపథ్యంలో బిల్లుపై తుది వైఖరిని వెల్లడించేందుకు కాంగ్రెస్ పార్టీ మిగతా విపక్షాలతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నట్లు పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. గతవారంలో లోక్‌సభలో ఆమోదం పొందిన ముస్లిం మహిళా బిల్లును రాజ్యసభలోనూ ప్రవేశపెట్టనున్నారు. 
 
అంతకుముందే రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల నేతలతో పార్లమెంట్‌లోని తన చాంబర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ అధికార వర్గాల సమాచారం. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధించాలని ప్రతిపాదించిన బిల్లు‌కు కాంగ్రెస్ మద్దతిస్తున్నప్పటికీ కొన్ని అంశాలపై సవరణలు తీసుకురావడానికి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు చెప్పాయి.
 
నిజానికి ఈ బిల్లును మంగళవారమే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించి, చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. విపక్షాలతో రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు జరిపిన సంప్రదింపుల సందర్భంగా దాదాపు అన్ని పార్టీలు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని స్పష్టం చేసిన నేపథ్యంలో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టలేకపోయారు. అయితే బుధవారం నాడు బిల్లును ఎగువసభలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని మంగళవారం నాడు పార్లమెంట్ ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు కేంద్రమంత్రి అనంత కుమార్ మీడియాతో చెప్పారు.