చిరు ఉద్యోగి నుంచి టాటా గ్రూపు ఛైర్మన్ స్థాయి... ఇదీ రతన్ టాటా ప్రస్థానం...
దివికేగిన రతన్ టాటా ప్రస్థానం ఎన్నో సాహసాలు, ఒడిదుకులతో సాగింది. అతి సాధారణ చిరు ఉద్యోగం నుంచి టాటా గ్రూపు చైర్మన్ స్థాయికి అయిన ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. తన విలువలకు కట్టుబడుతూనే భవిష్యత్ అంచనాలను ఆయన పసిగట్టిన తీరు దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకంగా నిలిచాయి.
ఒకింత ధైర్యం.. ఇంకొంత సాహసం.. సరికొత్త ఆలోచనలు ఉంటే చాలు అత్యున్నత శిఖరాలను అందుకోవచ్చని.. ఘనమైన విజయాలను సాధించవచ్చని రతన్ టాటా తన చేతల ద్వారా నిరూపించిన భారత ఇండస్ట్రియల్ ఐకాన్. దేశ కీర్తిని ఖండాంతరాలు దాటించిన తేజం. భారతదేశ వ్యాపార రంగానికే ఆయన పర్యాయపదంగా మారిపోయారు.
రతన్ టాటా తొలుత జెమ్‌షెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ ఉత్పత్తి విభాగంలో సాధారణ ఉద్యోగిగా చేరారు. వేలాది మంది ఉద్యోగులతో కలిసి నిప్పుల కొలిమి దగ్గర పనిచేశారు. అలా 1962లో అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ఆయన ఉద్యోగ జీవితం తొమ్మిదేళ్లపాటు రకరకాల పనులతో అక్కడే కొనసాగింది. తొలిసారి 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ (నెల్కో)డైరెక్టర్‌గా పెద్ద అవకాశం వచ్చింది. అయితే ఆ వార్త విని అంతగా ఆనందపడటానికి ఏమీ లేదు.
ఎందుకంటే అప్పటికే ఆ సంస్థ 40 శాతం నష్టాల్లో కూరుకొనిపోయి ఉంది. దాన్ని ఎలాగైనా లాభాల బాటలోకి నడిపించడానికి రతన్ సర్వశక్తులూ ఒడ్డారు. బహుశా ఈ సమయంలో రతన్ శక్తిసామర్థ్యాలను జేఆర్‌డీ టాటా పసిగట్టి ఉంటారు. కంపెనీ అభివృద్ధి కోసం రతన్ ప్రణాళికలకు మద్ధతు పలికారు. సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. రతన్ పగ్గాలు చేపట్టిన నాటికి ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో నెల్కో ఉత్పత్తుల వాటి 2 శాతం మాత్రమే. అమ్మకాల విలువ రూ.3కోట్లే. రతన్ నిరంతర కృషి ఫలితంగా మార్కెట్ వాటా 25 శాతానికి చేరింది. అమ్మకాల విలువ 1975లో 113 కోట్లకు ఎగబాకింది.
జేఆర్‌డీ టాటాకు మాత్రం రతన్ కార్యదీక్ష, దూరదృష్టి ఎంతగానో నచ్చాయి. నష్టాల్లో నడుస్తున్న కంపెనీలను గట్టెక్కించేందుకు గట్టిగా ప్రయత్నించడం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి అవసరాలను అంచనా వేయడం బాగా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా రతన్ తనలాగే ఆలోచించడం జేఆర్‌డీకి ఎంతగానో నచ్చింది. అతని జ్ఞాపకశక్తి మీదా ఎనలేని నమ్మకం కుదిరింది. అందుకే 1981లో టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా వైదొలుగుతూ తన వారసుడిగా రతన్‌టాటా పేరును ప్రతిపాదించారు. దీంతో రతన్ అనూహ్యంగా టాటా గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరుకున్నారు.