శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (09:50 IST)

రతన్ టాటా పెద్ద మనసు : మాజీ ఉద్యోగి ఇంటికెళ్లారు.. ఎందుకంటే...

దేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పెద్ద మనసు చూపించారు. తన కంపెనీలో పని చేస్తూ పదవీ విరమణ పొందిన ఉద్యోగి.. అనారోగ్యంబారినపడి మంచానికే పరిమితమైవున్నాడనే విషయాన్ని తెలుసుకుని కలత చెందారు. అంతటితో ఆయన మిన్నకుండిపోకుండా, ముంబై నుంచి పూణెకు కారులో ఆ మాజీ ఉద్యోగి ఇంటికెళ్లి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఈ పర్యటన అంతా గుట్టుచప్పుడు కాకుండా సాగడం గమనార్హం. 
 
యోగేశ్ దేశాయ్ అనే వ్యక్తి, తన లింక్డ్ ఇన్ ఖాతాలో టాటా పర్యటన గురించిన వివరాలు పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ ఉద్యోగి తన కంపెనీలో పనిచేశాడు. ఆ తర్వాత ఆయన అనారోగ్యంబారినపడి రెండేళ్లుగా మంచంలోనే ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రతన్ టాటా, పెద్ద మనసు చూపారు. 
 
ముంబై నుంచి పూణెకు చేరుకున్న ఆయన, మాజీ ఉద్యోగి ఇంటికి వెళ్లి, ఆరోగ్యంపై వాకబు చేశారు. మీడియాకు ఎటువంటి సమాచారం లేకుండా రతన్ టాటా పర్యటన సాగగా, ఆయన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
కాగా, రతన్ టాటా గతంలోనూ అనేక సందర్భాల్లో ఇలా పెద్ద మనసు చాటుకున్నారు. ముంబైపై ఉగ్రదాడులు జరిగిన వేళ, తన సంస్థల్లో పనిచేస్తూ బాధితులుగా మారిన 80 మంది ఉద్యోగుల కుటుంబాలను కలిసిన ఆయన, వారి పిల్లల చదువులకు అవసరమైన సాయం చేశారు.