సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (10:56 IST)

వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌పై మోడీ ఫొటోలను తొలగించండి : ఎలక్షన్‌ కమిషన్‌

ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌పై ప్రధాని మోడీ చిత్ర పటాన్ని తొలగించాలని కేంద్రాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున మోడీ ఫొటోను తొలగించాలని పేర్కొంది.

రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని ప్రధాని మోడీ దుర్వినియోగపరుస్తున్నారంటూ ఈ వారంలో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో బెంగాల్‌ ఎలక్టోరల్‌ కార్యాలయం నుండి ఎన్నికల కమిషన్‌ నివేదిక కోరింది.

అనంతరం ప్రధాని మోడీ చిత్రాలను తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. ఎన్నికలు నిర్వహించనున్న రాష్ట్రాల్లో టీకా సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫొటోలు ఉంచరాదని చెప్పింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేస్తున్న వ్యాక్సిన్‌ సర్టిఫికేట్లపై మోడీ ఫొటో ఉంచడంపై తృణమూల్‌ స్పందిస్తూ... వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తల నుండి క్రెడిట్‌ను మోడీ దొంగిలిస్తున్నారని విమర్శించింది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే ఈ సర్టిఫికేట్లపై ఆయన చిత్రంతో పాటు పేరును, సందేశాన్ని ఉంచడం ద్వారా పదవిని, అధికారాన్ని దోపిడీి చేయడమే కాకుండా కోవిడ్‌ ఉత్పత్తి చేస్తున్న సంస్థల క్రెడిట్‌ను దొంగలిస్తున్నారంటూ మండిపడింది.

వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు నిస్వార్థంగా అందిస్తున్న సేవలను కూడా దోచేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసింది.