గిరిజనులు హిందువులా, కాదా? వారికి డీఎన్ఏ టెస్ట్ చేయాలి... రాజస్థాన్ మంత్రి
గిరిజనులు హిందువులా కాదా అనే విషయంపై వారికి డీఎన్ఏ టెస్టులు చేయాలంటూ రాజస్థాన్ విద్యాశాఖామంత్రి మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు వివాదాస్పదంగా మారాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలోని మండి నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గిరిజనులు హిందువులు కాదంటూ బీఏపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ.. 'వారు హిందువులా? కాదా? అన్న విషయాన్ని వారి పూర్వీకులను అడిగి తెలుసుకుంటాం. వంశవృక్షం నమోదు చేసిన వారిని సంప్రదిస్తాం. ఒకవేళ వారు హిందువులు కాకపోతే వారు ఆ తల్లిదండ్రులు బిడ్డలేనా అని తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తాం' అని వ్యాఖ్యానించారు.
అధికారబలంతో మంత్రి చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. బన్సవారా ఎంపీ రాజ్ కుమార్ మాట్లాడుతూ డీఎన్ఏ పరీక్ష కోసం తమ రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను మంత్రి దిలావర్, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మకు పంపాలని గిరిజనులను కోరుతూ ప్రచారం ప్రారంభిస్తానని హెచ్చరించారు. గిరిజనులను మంత్రి అవమానించారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దిలావర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా విరుచుకుపడింది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా మాట్లాడుతూ దిలావర్ మానసిక స్థిమితం కోల్పోయారని విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతాప్లఢ్ ఆదివాసీ యువమోర్చా నిరసన ప్రదర్శన చేపట్టింది. మంత్రి దిష్టిబొమ్మలను దహనం చేసింది.