ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (11:17 IST)

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ కింగ్.. మరో నయా రికార్డు

Kohli
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో విరాట్ కోహ్లీ కింగ్‌గా నిలిచాడు. మరో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 8,000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ప్రత్యేక మైలురాయిని సొంతం చేసుకున్నాడు. గత రాత్రి రాజస్థాన్ రాయల్‌పై మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 33 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే వ్యక్తిగత స్కోరు 29 పరుగుల వద్ద విరాట్ 8,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ 6,769 పరుగులతో ఉన్నాడు. 
 
కాగా ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. 15 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఏకంగా 741 పరుగులు బాదాడు. 64 సగటు, 155 స్ట్రైక్ రేట్‌తో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ యేడాది సీజన్‌‌లో కోహ్లీ ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. కాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్ మ్యాచ్ ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే ఆర్సీబీ కల వరుసగా 17వ సారి చెదిరింది. ముఖ్యంగా సుదీర్ఘకాలం నుంచి విరాట్ కోహ్లీకి మరోసారి నిరాశ తప్పలేదు.