శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (17:20 IST)

నా ఎన్నిక తాత్కాలికమే.. 72 పేజీలతో ఈసీకి వివరణ ఇచ్చిన శశికళ

తమిళనాడు సీఎం కుర్చీ కావాలని శతవిధాలా ప్రయత్నించి.. చివరికి ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళకు అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి ఊడిపోయేటట్లు ఉంది. అన్నాడీఎంకే పార

తమిళనాడు సీఎం కుర్చీ కావాలని శతవిధాలా ప్రయత్నించి.. చివరికి ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళకు అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి ఊడిపోయేటట్లు ఉంది. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను భారత ఎన్నికల కమిషన్ తిరస్కరిస్తే ఆ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంపై పరప్పన అగ్రహార జైలు వద్ద చర్చ సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తన ఎన్నికకు సంబంధించి శశికళా నటరాజన్ ఎన్నికల సంఘానికి మంగళవారంనాడు సమాధానమిచ్చారు. శశికళ తరఫున అన్నాడీఎంకే న్యాయవాదులు 72 పేజీల వివరణను ఈసీకి సమర్పించారు. పన్నీర్ సెల్వం మద్దతురాలు చేసిన ఆరోపణలను ఈ వివరణలో శశికళ తోసిపుచ్చారు. 
 
పార్టీ ప్రధాన కార్యదర్శిని కార్యకర్తలు ఎన్నుకుంటే.. ప్రధాన కార్యదర్శిగా తన నియామకం తాత్కాలిక చర్య మాత్రమేనని శశి వివరించారు. తాత్కాలిక ఏర్పాట్లు చేసే అధికారం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్‌కు ఉందని ఈమె వివరించారు. 
 
ఇకపోతే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై వివరణ కోరుతూ శశికళకు ఈసీ ఇటీవల నోటీసు పంపింది. శశికళ ఉంటున్న బెంగళూరు జైలుకే ఈ నోటీసులు వెళ్లాయి. ఈనెల 28వ తేదీలోగా శశికళ జవాబు ఇవ్వకుంటే, ఆమె వద్ద సమాధానం లేదని భావించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఈసీ ఆ నోటీసులు పేర్కొంది. జయలలిత మృతిచెందిన మరుసటి రోజే పార్టీ ప్రదాన కార్యదర్శిగా శశికళ నియామకం కావడంపై అన్నాడీఎంకే తిరుగుబాటు ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈసీ ఈ నోటీసులు పంపింది. దీనిపై శశి సమాధాన మిచ్చారు. 
 
అయితే తన ఎంపిక తాత్కాలికమేనని శశి ఇచ్చిన వివరణపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేపింది. శశికళ ఇచ్చిన వివరణకు భారత ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదంటే ఆమె పదవి ఊడిపోతోంది. శశికళ పదవి ఊడిపోతే ఆమె వెనుక ఉన్న శాసన సభ్యులు అక్కడి నుంచి మకాం మార్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఎడప్పాడి పళనిసామికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.