కస్టమర్ల డబ్బుకు కాపలా ఉండాల్సిన మేనేజర్ బ్యాంకుకే కన్నం వేశాడు...
కస్టమర్ల డబ్బుకు కాపలా ఉండాల్సిన మేనేజర్ ఒకరు ఏకంగా బ్యాంకుకే కన్నం వేశాడు. నెలకు 50 వేల రూపాయల విలువ చేసే బంగారు నాణేలను దొంగిలిస్తూ వచ్చాడు. ఇలా 17 నెలల పాటు దొంగతనం చేశాడు. చివరకు బ్యాంకు ఆడిటింగ్‌లో అతని బండారం బయటపడింది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం అంగీకరించడంతో అరెస్టు చేసి కటకటాలవెనక్కి పంపించారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఈ బ్యాంకు చోరీ వివరాలను పరిశీలిస్తే...
ఈ రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు 82 కిలోమీటర్ల దూరంలోని మెమారి అనే ప్రాంతలో ఎస్.బి.ఐ శాఖ ఉంది. ఈ శాఖ మేనేజరుగా తారక్ జైశ్వాల్ పని చేస్తున్నారు. ఈయన ఈ శాఖలో 17 నెలలుగా పని చేస్తూ, 17 నెలల నుంచి ఒకటే పనిగా పెట్టుకున్నాడు. అది రోజుకు కొన్ని నాణేలను దొంగతనం చేయడం. అంటే నెలకు రూ.50 వేల విలువైన కాయిన్స్‌ను చోరీ చేస్తూ వచ్చాడు.
ఈ విషయం బ్యాంకు ఆడిటింగ్‌లో బట్టబయలైంది. నవంబర్ 27వ తేదీ నుంచి ఈ ఆడిట్ మొదలవగా తారక్ బండారం బయటపడింది. శుక్రవారం పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా.. తాను దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.
లాటరీలకు అలవాటు పడిన తారక్... వాటిని కొనుగోలు చేయడానికి ఈ నాణేలను దొంగతనం చేయడం మొదలుపెట్టినట్టు వెల్లడించాడు. అలా రూ.84 లక్షల విలువ చేసే నాణేలను దొంగిలించినట్టు చెప్పాడు.