ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (10:26 IST)

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరీ ఆరోగ్యం విషమం!

sitaram yechuri
సీపీఎం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఆరోగ్య పరిస్థితితి మరింత క్లిష్టంగా ఉంది. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయనను గురువారం రాత్రి వెంటిలేటర్‌పై ఉంచి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
72యేళ్ల సీతారాం ఏచూరీ కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడతున్నారు. ఈ క్రమంలో గత నెల 19వ తేదీన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూకి తరలించాల్సి వచ్చింది. ఒక ప్రత్యేక వైద్యుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. న్యుమోనియా లాంటి ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారని సమాచారం. అయితే చికిత్సకు సంబంధించిన వివరాలను హాస్పిటల్ ప్రకటించలేదు. 
 
మరోవైపు ఇటీవలే ఆయన కంటికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆగస్టు 31నే సీపీఎం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది. 'భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు' అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది.