గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బుద్ధిగా చదువుకోమన్న తల్లి.. కిరాతకంగా చంపేసిన కొడుకు.. ఎక్కడ?

మొబైల్ ఫోను మోజులో పడిన ఓ కుర్రోడు అతి కిరాతకంగా తన తల్లిని చంపేశాడు. ఇంతకీ ఆ తల్లి చేసిన నేరమేంటో తెలుసా... ఫోను పక్కనబెట్టి... బుద్ధిగా చదువుకోమని చెప్పడమే. ఈ మాటలను జీర్ణించుకోలేని కొడుకు.. కన్నతల్లిని కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మాండ్యాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధుసూదన్, శ్రీలక్ష్మి (45) దంపతుల కుమారుడు మనుశర్మ (21) బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. నిత్యం మొబైల్ ఫోను మత్తులో మునుగుతుండటంతో తల్లి మందలించింది. ఈ క్రమంలో గురువారం అతడి కోసం స్నేహితుడు ఇంటికొచ్చాడు.
 
అయితే, బయటకు వెళ్లొద్దని తల్లి హెచ్చరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో కుమారుడి తలపై తల్లి గట్టిగా కొట్టింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మనుశర్మ.. వంటింట్లోకి వెళ్లి చాకు తీసుకొచ్చి విచక్షణ రహితంగా పొడిచి బయటకు వెళ్లిపోయాడు. 
 
తీవ్రగాయాలపాలైన శ్రీలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. కాసేపటికి ఇంటికి వచ్చిన శ్రీలక్ష్మి భర్త మధుసూదన్, మరో కుమారుడు ఆదర్శ.. అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికొచ్చి పరిశీలిస్తున్న సమయంలోనే తిరిగి ఇంటికొచ్చిన మనుశర్మ ఏమీ తెలియనట్టు నటించాడు.
 
కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కుటుంబ సభ్యులతోపాటు మనుశర్మను కూడా విచారించారు. అతడు చెబుతున్న దాంట్లో పొంతన లేకపోవడంతో తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. తల్లిని తానే చాకుతో పొడిచి బయటకు వెళ్లిపోయినట్టు చెప్పాడు. కొడుకే తల్లిని చంపినట్టు తెలియడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. నిందితుడిని నిన్న అరెస్ట్ చేసి జైలుకు పంపారు.