5వ నీట్ పరీక్ష : కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య .. సారీ నాన్నా అంటూ సూసైడ్ లేఖ
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటికే రెండుసార్లు నీట్‌కు సిద్ధమై విఫలమయ్యాడు. ఇపుడు మరోమారు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన నీట్ ప్రవేశ పరీక్ష రాయాల్సివుండగా, ఒత్తిడికి లోనైన ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని భరత్‌గా గుర్తించారు. ఈ యేడాది నీట్‌లో విజయం సాధించలేకపోతున్నానంటూ సూసైడ్ లేఖలో తండ్రికి సారీ చెప్పాడు.
దేశంలో పోటీ పరీక్షలకు రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రాంతం కేంద్రంగా మారింది. ఇక్కడ నీట్‌కు కోచింగ్ తీసుకుంటూ వచ్చిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సారీ నాన్నా అంటూ విద్యార్థి సూసైడ్ లేఖ రాసిపెట్టి ఉరేసుకున్నాడు. మృతుడిని భరత్ కుమార్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. ఇది గత 48 గంటల్లో వెలుగు చూసిన రెండో ఆత్మహత్య కేసు కావడంతో స్థానికంగా కలకలం చెలరేగింది.
భరత్ కుమార్ కొంతకాలంగా నీట్ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటికే అతడు రెండుసార్లు నీట్‌కు హాజరయ్యాడు. తన బంధువు రోహిత్‌తో కలిసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. కాగా, మే 5వ తేదీన నీట్ పరీక్షకు మరోమారు హాజరుకావాల్సివుంది. అయితే, మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో రోహిత్ ఏదో పనిమీద బయటకు వెళ్లగా, భరత్ కుమార్ ఒక్కరే గదిలో ఉన్నాడు. ఆ సమయంలో భరత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ హాస్టల్ గదికిరాగా భరత్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడు.
ఆ తర్వాత హాస్టల్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు మునుపు భరత్ ఓ సూసైడ్ లేఖ కూడా రాసిపెట్టాడు. "సారీ నాన్నా.. ఈ యేడాదీ నేను సక్సెస్ కాలేకపోయాను" అని భర్త లేఖలో పేర్కొన్నారు. పరీక్షల్లో ఆశించిచన ఫలితాలు రాకపోవడంతో భరత్ తీవ్ర ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్టన్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.