మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (13:27 IST)

నీట్ పీజీ అడ్మిషన్లకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు

దేశ వ్యాప్తంగా నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేపట్టవచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్. బొపన్నలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. అలాగే, నీట్ పీజీ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్ కోటాను కూడా ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించేందుకు పచ్చజెండా ఊపింది. దీంతో పీజీ కౌన్సెలింగ్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరబడింది. 
 
అదేసమయంలో ఆయా రాష్ట్రాల వైద్య కాలేజీల్లో అఖిల భారత కోటాలోని సీట్ల భర్తీలో పాత రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని తెల్పింది. కాగా, నీట్ పీజీ కోటాపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల రెసిడెంట్ వైద్యులు ఆందోళన చేశారు. అలాగే, ఒక రోజు వైద్య సేవలను కూడా బంద్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నీట్ పీజీ ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు పొందేవారికి వార్షిక ఆదాయం రూ.8 లక్షల మేరకు ఉండాలన్న నిబంధన కూడా ఈ యేడాది వర్తించనుంది.