#RajasthanCM ఎవరు? నేడు బీజేపీ కీలక సమావేశం
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించింది. వీటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‍గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే, ఈ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం ఆ పార్టీ పెద్దలకు తలకుమించిన భారంగా మారింది. ముఖ్యంగా, రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపిక చేసే విషయంలో ఆ పార్టీ ఎంటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతుంది. ఈ సీఎం రేసులో అనేక మంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే గట్టి పోటీ ఇస్తున్నారు. ఆమెను కాదనలేక కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు.
ఎన్నికలకు ముందే వసుంధరాజేను సీఎం అభ్యర్థిగా ప్రకటించి వుండే ఇపుడు ఆమెనే సీఎంగా చేసివుండేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు. పోటీలో అనేక మంది నేతలు ఉన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఓం మాథూర్, దియా కుమారి, కిరోరి లాల్ మీనా, బాబా బాలక్ నాథ్ వంటి వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జైపూర్ వేదికగా జరిగే కీలక సమావేశంలో రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోనుంది.
మరోవైపు, బీజేపీ అధిష్టానం మాత్రం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొత్త ముఖాన్ని ఎంపిక చేయాలన్న పట్టుదలతో ఉంది. ఆ కొత్త ముఖం ఎవరన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం జరుగనుంది. ఇందులో కొత్త ముఖ్యమంత్రి ఎవరో తెలిపోనుంది.