బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 17 జులై 2021 (09:10 IST)

ఆర్థిక సాయాన్ని తిరస్కరించడంతోనే అత్యాచార ఆరోపణలు : టి సిరీస్ వివరణ

ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ టి సిరీస్‌ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్‌ కుమార్‌పై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. ఆమె లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, మూడేళ్లపాటు భూషణ్‌ తనపై అత్యాచారం చేశాడన్న బాధితురాలి ప్రధాన ఆరోపణ. 
 
ఈ ఆరోపణను టి సిరీస్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఆమె చెప్పేవన్నీ అవాస్తవాలేనని, ఈ మేరకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ ప్రకటన విడుదల చేసింది. పైగా, ఆమె కోరిన ఆర్థిక సాయాన్ని భూషణ్ కుమార్ తిరస్కరించడం వల్లే ఈ తరహా ఆరోపణలు చేస్తుందని టి సిరిస్ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ ప్రకటనలో.. 'భూషణ్‌ కుమార్‌ మీద వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పని పేరుతో ఆమెపై భూషణ్‌ అత్యాచారం చేశాడన్నది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే గతంలో ఆమె సినిమా, మ్యూజిక్‌ వీడియోల కోసం టీ సిరీస్‌ బ్యానర్‌లో పని చేసింది. ఈ ఏడాది మార్చిలో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మించాలనుకున్న ఆమె ఆర్థిక సాయం కోసం భూషణ్‌ కుమార్‌ను సంప్రదించింది. కానీ ఆమె విన్నపాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించాడు. 
 
ఆ తర్వాత జూన్‌లో(మహారాష్ట్రలో లాక్డౌన్‌ ఎత్తేశాక) భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తూ మరోసారి టీ సిరీస్‌ బ్యానర్‌ను సంప్రదించింది. ఈ క్రమంలో దోపిడీకి సైతం ప్రయత్నించగా జూలై 1న అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాం. దొంగతనానికి ప్రయత్నించింది అని నిరూపించేందుకు మా దగ్గర ఆడియో క్లిప్పింగ్స్‌ కూడా ఉన్నాయి. వీటిని అధికారులకు అప్పగిస్తాం. ఆ దోపిడీ కేసుకు కౌంటర్‌గా ఆమె ఈ ఫిర్యాదు చేసిందే తప్ప అంతకు మంచి మరొకటి కాదు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం' అంటూ ఆ ప్రకటనలో టి సిరీస్ వివరణ ఇచ్చింది.