ఎయిడ్స్ వ్యాధి సోకిందనీ తెలిసీ వివాహానికి సిద్ధమయ్యాడు.. తర్వాత ఏం జరిగింది?
తమిళనాడు రాష్ట్రానికి చెందిన 34 యేళ్ల వ్యక్తి ఒకరు తాను ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసినప్పటికీ... మరో యువతి జీవితంతో చెలగాటమాడేందుకు ప్రయత్నించాడు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన 34 యేళ్ల వ్యక్తి ఒకరు తాను ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసినప్పటికీ... మరో యువతి జీవితంతో చెలగాటమాడేందుకు ప్రయత్నించాడు. చివరకు ఓ ఆకాశరామన్న జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన సమాచారం ఈ పెళ్లితంతు అర్థాంతరంగా రద్దుకాగా, వరుడైన ఎయిడ్స్ రోగి జైలుపాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
తిరువణ్ణామలై జిల్లా చెంగం అనే ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల మహిళతో సోమవారం వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. ఇందుకోసం చెంగంలో ఉన్న ఓ కల్యాణమండపంలో ఏర్పాట్లు జరిగాయి. ఆదివారం రాత్రి రిసెప్షన్ కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక డీఎంకే ఎమ్మెల్యేతో పాటు వధూవరుల బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెల్లారితో వధువు మెడలో వరుడు తాళి కట్టాలి.
ఈనేపథ్యంలో వరుడు ఎయిడ్స్ బాధితుడని, ఇందుకోసం చికిత్స పొందుతున్నాడని జిల్లా కలెక్టర్ పళనికి రహస్య సమాచారం అందింది. కలెక్టర్ ఆదేశాలతో వైద్యశాఖ అధికారులు వరుడి సెల్‌ఫోన్‌కు పలుమార్లు కాల్ చేసిన అతను స్పందించకపోవడంతో జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి సోకి చికిత్స పొందుతున్న వారి వివరాలను పరిశీలించారు. ఇందులో వరుడు పేరు కూడా ఉంది. దీంతో స్థానిక ఆర్‌డీఓ, తహసీల్దార్, డీఎస్పీ, ప్రభుత్వ వైద్యుడు తదితరులు కల్యాణమండపానికి వెళ్లి వరుడిని, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలుగుట్టు బహిర్గతమైంది. దీంతో వరుడిపై మోసంకేసు నమోదుచేసి అరెస్టుచేశారు. తల్లిదండ్రులను మందలించి వదిలిపెట్టారు.