శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:49 IST)

కరిచిన పాముతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. ఎందుకంటే?

తనను కరిచిన పామును పట్టుకుని ఓ వృద్ధుడు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. వృద్ధుడి చేతిలో పామును చూసిన ఆస్పత్రి సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని చిన్నకండియన్ కుప్పంలో రంగనాథన్ అనే వృద్ధుడు నివశిస్తున్నాడు. ఈయన రోజువారిలాగే తన పొలంలో పని చేసుకుంటుండగా, ఆయన కాలుకు పాము కాటువేసింది.
 
పాము కరిచిందన్న భయం ఏమాత్రం లేకుండా, ఆ పామును చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పామును ఓ గోనె సంచిలో వేసుకుని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అపుడు చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగులు.. ఈ పామును చూసి కేకలు వేస్తూ భయానికి లోనై పారిపోయారు. ఆ తర్వాత ఈ పామును చూసిన వైద్యులు కూడా షాక్‌కు గురయ్యారు. 
 
కానీ, రంగనాథన్ మాత్రం దీనిపై మాట్లాడుతూ, తనను కాటేసిన పాము మంచిదే అయినప్పటికీ.. విషం మాత్రం చాలా ప్రమాదమని తెలిసే దాన్ని పట్టుకుని వచ్చినట్టు తెలిపారు. ఆ తర్వాత రంగనాథన్‌కు వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఆయన ఇంటికి వెళుతూ ఆ పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.