12 యేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని ఉపాధ్యాయుడు
తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జయంకొండం సమీపంలోని కారైక్కురిచ్చి గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు గత 12 యేళ్లుగా ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా సెలవు తీసుకోక పోవడం గమనార్హం. ఈ గ్రామంలో ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉంది. ఇక్కడి సింతామణి గ్రామానికి చెందిన కలైయరసన్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తొలుత కాట్టుమన్నార్గుడి, తర్వాత సిలాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహించారు. ఇపుడు కారైక్కుర్చి ప్రభుత్వ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
ఈయన గత 2014 నుంచి సెలవు తీసుకోకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ఉదయం 9 గంటలకు పాఠశాలకు వస్తానని, విద్యార్థులకు తరగతి ప్రారంభం అవడానికే ముందే, వారికి ఏదో ఒక పాఠం బోధించేవాడినని చెప్పారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రన్ మాట్లాడుతూ.. అందరికీ కలైయరసన్ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో ప్రభుత్వం తరఫున పాఠశాలకు వచ్చే సంక్షేమ సాయం విద్యార్థులకు అందిస్తారని చెప్పారు. ఈ పాఠశాలలో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఇందుకు ఇక్కడున్న ఉపాధ్యాయులు ఉత్తమ విధానంలో విద్యను బోధించడమే కారణం అని చెప్పారు.