గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (10:04 IST)

అలిగిన భార్యను బుజ్జగించేందుకు సెలవు కోరిన కానిస్టేబుల్ ... మంజూరు చేసిన ఏఎస్పీ

uppolice
అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు ఓ కానిస్టేబుల్ సెలవు కోరారు. ఇందుకోసం ఆయన తన పైఅధికారి ఏఎస్పీకి ఓ ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాన్ని చదివిన ఏఎస్పీ జాలిపడుతూ ఆ కానిస్టేబుల్‌కు సెలవు మంజూరు చేశారు. అదేసమయంలో కానిస్టేబుల్ రాసిన ఉత్తరం ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్‌లో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మహరాజ్ గంజ్‌కు చెందిన కానిస్టేబుల్ గౌరవ్ చౌధరికి గత యేడాది వివాహమైంది. అయితే, వివాహమైన కొన్ని రోజులలకే భార్యను ఇంటి వద్ద వదిలి డ్యూటీలో చేరాడు. ఆ తర్వాత నుంచి మళ్లీ ఇంటికి వెళ్లలేదు. దీంతో భర్తపై భార్య కోపగించుకోవడమేకాకుండా అలిగింది. భర్త ఫోన్ చేసినా భార్య లిఫ్ట్ చేయడం మానేసింది. 
 
దీంతో భార్య తనపై అలిగిందన్న నిర్ధారణకు వచ్చిన కానిస్టేబుల్ గౌరవ్ సెలవు పెట్టి ఇంటికెళ్లి ఆమెను బుజ్జగించాలన్న నిర్ణయానికి వచ్చాడు. వెంటనే తన పై అధికారి అయిన ఏఎస్పీకి లీవ్ లెటర్ రాస్తూ, పెళ్ళయిన వెంటనే తన భార్యను వదిలి వచ్చినందుకు ఆమె తనపై అలిగిందని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ కట్ చేస్తేందని, కొన్నిసార్లు ఫోన్ తీసినా మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తుందని, భార్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లడం లేదని వాపోయాడు. 
 
అందువల్ల అలిగిన భార్యను బుజ్జగించేదుకు తనకు వారం రోజుల సెలవు కావాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశాడు. ఆలేఖను చూసిన గౌరవ్ బాధను అర్థం చేసుకున్న ఏఎస్పీ ఐదు రోజుల సెలవు మంజూరు చేశారు. ఆ తర్వాత ఈ లేఖను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది.