గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (11:32 IST)

టీకొట్టు వ్యాపారికి రూ.109 కోట్లు జీఎస్టీ బిల్లు.. వామ్మో అంటూ గుండె పట్టుకున్నాడు..

Tea Stall
టీకొట్టు వ్యాపారికి జీఎస్టీ బకాయి కింద రూ.109 కోట్లు జమచేయాలని నోటీసులు జారీ అయ్యాయి. అంతే రెక్కాడితే డొక్కాడని ఆ టీ కొట్టు వ్యాపారికి షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. కార్తీక్‌ రౌర్కెలా కోయల్‌నగర్‌ లింగరాజ్‌ ట్రేడింగ్‌ కంపెనీ షాపింగ్‌మాల్‌ ఆవరణలో టీకొట్టు నడుపుకుంటున్నాడు. అలాగే కూరగాయల చిల్లర వ్యాపారం చేస్తుంటాడు. వీటితో చేతికి అందిన చిరు మొత్తంతో కుటుంబం నడుపుకుంటున్న సాదాసీదా వ్యక్తి. 
 
సంతకం చేయడం రాని నిరక్షరాశ్యుడు. ఈ వ్యక్తిని ట్రేడింగ్‌ కంపెనీ యజమానిగా, భారీ భవంతి అద్దెకు నడుపుతున్నట్లు పేర్కొని, నోటీసులు జారీ చేయడంతో షాక్ తప్పలేదు. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది.
 
జీఎస్‌టీ ఎగవేత తాఖీదులో పేర్కొన్న లింగరాజ్‌ ట్రేడింగ్‌ కంపెనీ షాపింగుమాల్‌ ఆవరణలో టీకొట్టు, అక్కడే కూరగాయలు అమ్ముకుంటున్న వ్యక్తి కార్తీక్‌ కమిలగా విచారణలో తేలింది. విచారణలో పలు అంశాలను సమీక్షించడంతో తాఖీదులో వివరాలు బూటకమని స్పష్టమైంది.