సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (10:27 IST)

భారత్‌లో కూడా హైస్పీడ్ రైళ్లు.. గంటకు 220 కిమీ వేగం?!!

high speed train
భారత్‌లో కూడా హైస్పీడ్ రైళ్ళను ప్రవేశపెట్టే దిశగా భారతీయ రైల్వే శాఖ కసరత్తులు చేపట్టింది. ఇప్పటికే వందే భారత్ పేరుతో గంటకు 150 నుంచి 160 కిమీ వేగంతో నడిచే రైళ్లను ప్రవేశపెట్టగా, వీటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో వందే భారత్ రైళ్ళకు మరింత ధీటుగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఈ రైళ్ళు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నాయి. ఈ రైలు పట్టాలెక్కితే హైదరాబాద్ శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం నాలుగున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. 
 
అయితే, ఈ హైస్పీడ్ రైళ్లను నడపాలంటే ఇపుడున్న ట్రాక్‌‍లు ఏమాత్రం పనికిరావు. ఎంతో వేగంగా వెళఅలే ఈ రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్‌ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఈ నేపథ్యంలో పలు మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని రైల్వే సాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో ఏపీ, తెలంగాణాల్లో రెండు రూట్లు ఉన్నాయి. 
 
హైదరాబాద్ - విశాఖపట్ణం, కర్నూలు - విజయవాడ రూట్లలో ఈ హైస్పీడ్ కారిడార్‌ ఏర్పాటు చేయడానికి చేపట్టిన ప్రాథమిక సర్వే ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ప్రాథమిక ఇంజనీరింగ్, ట్రాఫిక్  సర్వే రిపోర్టు కూడా వస్తే ఆ తర్వాత డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేస్తారు. 
 
అయితే, ఈ ప్రాజెక్టు వ్యయం రూ.20 వేల కోట్లు. హైస్పీడ్ రైళ్లు ప్రయాణించేందుకు ఎలివేటెడ్ కారిడార్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తే బడ్జెట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక సర్వేలో ఎక్కడెక్కడ బ్రిడ్జిలు నిర్మించాలి, ఎక్కడెక్కడ ఇతర నిర్మాణాలు చేపట్టాలి అనేది పరిశీలించారు. అయితే, హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కాలంటే మరో ఐదారేళ్లు వేచి ఉండక తప్పదు.