మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:29 IST)

ఆ ఐదు రాష్ట్రాలకు ఉగ్రముప్పు

జార్ఖాండ్, బిహార్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ముప్పు పొంచి ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హెచ్చరించింది.

ఆ ఐదు రాష్ట్రాలలో జేఎంబీ కార్యకలాపాలు పెరిగినట్టు గుర్తించామని, అనుమానిత ఉగ్రవాదుల పేర్లను సంబంధిత ఏజెన్సీల దృష్టికి తీసుకు వెళ్తున్నామని ఎన్ఐఏ డీజీ యోగేష్ చందర్ మోదీ తెలిపారు. బంగ్లాదేశ్ వలసవాదుల పేరుతో జేఎంబీ తమ కార్యకలాపాలు సాగిస్తోందని చెప్పారు.

రాష్ట్రాల యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) చీఫ్‌లను ఉద్దేశించి యోగేష్ చందర మోదీ మంగళవారం నాడు మాట్లాడుతూ, 25 మంది మోస్ట్ వాంటెడ్ జేఎంబీ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేసి, వారి జాడ తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలతో సమాచారం పంచుకున్నట్టు చెప్పారు. రాష్ట్రాల సహకారంతో ఇలాంటి ఉగ్రవాద సంస్థల సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయా ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ ఉగ్ర సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. కాగా, రెండు రోజుల పాటు సాగే ఏటీఎస్, ఎస్‌టీఎఫ్ చీఫ్‌ల సమావేశానికి ఎన్ఐఏ సమన్వయకర్తగా వ్యవహరిస్తోంది.

ఉగ్రవాద నిధులు, రేడికలైజేషన్, డిజిటల్ ఎవిడెన్స్ సహా పలు అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తన్నారు. జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ సైతం ప్రసంగించనున్నారు.