గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (16:48 IST)

ఐటీ అధికారులకు కేంద్రం షాక్.. 85 మంది అధికారులపై వేటు

అవినీతి, అక్రమాలకు పాల్పడిన విశాఖ, రాజమండ్రి ఐటీఓలతోపాటు 85 మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. అవినీతికి పాల్పడిన ఇద్దరు ఏపీ ఆదాయపుపన్ను శాఖ అధికారులకు నిర్బంధ పదవీ విరమణ చేయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. 
 
రాజమండ్రి ఇన్‌కం టాక్స్ ఆఫీసరుగా పనిచేస్తున్న ఓ మహిళా అధికారిణిని సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా ఆమె వద్ద రూ.1.5లక్షల లంచం డబ్బు లభించింది. విశాఖపట్టణానికి చెందిన మరో ఐటీఓ అధికారి వద్ద రూ.75వేల లంచం సొమ్ము దొరికింది. దీంతో వారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
 
 
రాజమండ్రి, విశాఖ ఐటీఓలతో పాటు 21 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారులను నిర్బంధంగా పదవీ విరమణ చేయిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఈ ఏడాది ఐదు విడతలుగా 85 మంది ఆదాయపు పన్నుశాఖ అవినీతి అధికారులపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వేటు వేసింది. ఇందులో 64 మంది సెంట్రల్ బోర్డు, కస్టమ్స్, సీబీడీటీ స్థాయి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖలో అవినీతి అధికారులపై వేటు వేసేందుకే వారితో నిర్బంధ పదవీ విరమణ చేయించామని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.