శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (09:59 IST)

తమిళనాడులో తెరపైకి కాంపోజిట్ బలపరీక్ష.. డీఎంకే అండ ఉంటే పన్నీర్‌కే పగ్గాలు?

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఎడతెరిపి లేకుండా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, పెక్కుమంది కంపోజిట్ బలపరీక్షను నిర

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఎడతెరిపి లేకుండా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, పెక్కుమంది  కంపోజిట్ బలపరీక్షను నిర్వహించాలని సూచన చేస్తున్నారు. 
 
అసెంబ్లీలో బల నిరూపణకు తమకు తొలి చాన్స్ ఇవ్వాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఓపక్క.. అత్యధిక ఎమ్మెల్యేల బలమున్న తనకే అవకాశం ఇవ్వాలని పళనిస్వామి మరోపక్క డిమాండ్ చేస్తున్న వేళ, కాంపోజిట్ బలపరీక్ష నిర్వహించాలని నిపుణుల నుంచి గవర్నర్ విద్యాసాగర్ రావుకు సలహా అందినట్టు సమాచారం. 
 
గతంలో ఉత్తరప్రదేశ్‌‌లో కళ్యాణ్‌ సింగ్, జగదాంబికా పాల్‌‌లు ప్రభుత్వ ఏర్పాటు కోసం పోటీ పడినవేళ కాంపోజిట్‌ బలపరీక్ష నిర్వహించాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని గుర్తు చేస్తున్న నిపుణులు, తమిళనాడులో సైతం ఇదే పద్ధతి అవలంభించాలని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ గవర్నర్‌‌కు సూచించారు. 
 
ప్రస్తుతం తమిళనాడులో కూడా ఇదేతరహా పరిస్థితి నెలకొంది. అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ ఏర్పాటు చాన్స్ తమకే ఇవ్వాలంటూ ఎవరికి వారు ఒకేసారి కోరుతున్నాడు. ఎవరికి ఎంత బలముందో స్పష్టత లేదు. ఇలాంటి సమయాల్లో శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి, బల నిరూపణకు అవకాశమిచ్చేలా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. 
 
సభకు హాజరైన ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎవరికి ఉందో వారిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. మూజువాణీ ఓటింగ్ లేదా డివిజన్ ఓట్ ద్వారా విజేతను నిర్ణయించవచ్చు. డివిజన్‌ ఓట్‌ కోరితే, బ్యాలెట్‌ లేదా ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉంటాయి. ఇద్దరికీ సమానమైన ఓట్లు వస్తే, స్పీకర్‌ ఓటు వేసి విజేతను నిర్ణయిస్తారు.