శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (14:14 IST)

ఆమెగా అతడు.. అతడుగా ఆమె.. సెక్స్ రీఅలైన్మెంట్ సర్జీరీతో ఒక్కటైన ప్రేమికులు

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. అమ్మాయిగా ఉన్న యువతి అతడుగా మారిపోయింది. అబ్బాయిగా ఉన్న యువకుడు అమ్మాయిగా మారిపోయాడు. వీరిద్దరూ సెక్స్ రీఅలైన్మెంట్ సర్జరీతో అలా మారారు. ఆ తర్వాత వారిద్దరూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విచిత్ర వివాహ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతా శివారు ప్రాంతమైన మహజాతి నగర్‌లో సుశాంత్ అనే యువకుడు ఉన్నాడు. ఇతను పేరుకు మాత్రమే అబ్బాయి. కానీ, ఇతనిలో పూర్తిగా అమ్మాయి లక్షణాలే కనిపించేవి. ఈ విషయాన్ని గమనించిన సుశాంత్.. లింగ మార్పిడి ద్వారా అమ్మాయిగా మారిపోయాడు. పేరు కూడా సుశాంత్ నుంచి తీస్తా దాస్‌గా మార్చుకున్నాడు. 
 
ఆ తర్వాత వెస్ట్ బెంగాల్‌కు చెందిన తొలి ట్రాన్స్‌జెండర్ ప్రిన్సిపాల్ మనాబి బందోపాధ్యాయ్ ప్రోత్సాహంతో సెక్స్ రీ అలైన్మెంట్ సర్జరీ చేయించుకున్నాడు. దీంతో అతను పూర్తి స్థాయి స్త్రీగా మారిపోయాడు. ఈ ఆపరేషన్ కోసం భారీగానే ఖర్చు అయింది. ఇందుకోసం చేసిన అప్పును తీర్చలేక తీస్తా దాస్ తండ్రి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. 
 
ఇదిలావుంటే, అస్సాంకు చెందిన ఓ అమ్మాయి ఇదే తరహా ఆపరేషన్ చేయించుకుని పురుషుడుగా మారిపోయింది. ఈమె (అబ్బాయి)పేరు చక్రవర్తి. చివరకు తీస్తాదాస్ - చక్రవర్తిలకు మధ్య పరిచయం ఏర్పడి, చివరకు అది ప్రేమగా మారింది. చివరకు మూడు ముళ్ళతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత ఏప్రిల్ నెలలో 15వ తేదీన ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిద్దరి వివాహాన్ని అనేక మంది వ్యతిరేకించినా వారిద్దరు మాత్రం పట్టించుకోకుండా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లికి తొలి ట్రాన్స్‌జెండర్ ప్రిన్సిపాల్ మనాబీ పూర్తి సహాయ సహకారాలు అందించింది.