గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మే 2023 (14:53 IST)

పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం... మోడీ పట్టాభిషేకంలా భావిస్తున్నారు : రాహుల్

rahul gandhi - modi
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శించారు. పార్లమెంట్‌.. ప్రజల గళమని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన కాసేపటికే రాహుల్‌ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రారంభోత్సవ వేడుకలను కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించిన విషయం తెలిసిందే. 
 
మరోవైపు కొత్త పార్లమెంట్‌ భవనానికి పునాది రాయి వేసిన సమయంలోనూ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను దూరం పెట్టారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ఇప్పుడు ప్రారంభోత్సవ వేడుకలకు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కన పెట్టారని విమర్శించారు. 
 
ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనా విధానాన్ని ప్రతిబింభిస్తుందని ఆరోపించారు. ఆయా రాజ్యాంగబద్ధ పదవులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, చరిత్రాత్మక కార్యక్రమాల్లో మాత్రం వారికి భాగస్వామ్యం కల్పించడం లేదని విమర్శించారు. 
 
నూతన పార్లమెంట్ భవనానికి రాష్ట్రపతి మాత్రమే ప్రారంభోత్సవం చేయాలన్న డిమాండ్‌తో విపక్ష పార్టీలన్నీ ఏకమై గళం వినిపించి, ఆదివారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలను బహిష్కరించాయి. కానీ, బీజేపీ పాలకులు మాత్రం ఏమాత్రం ఖరారు చేయకుండా పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించాయి.