శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (11:07 IST)

ఏంటీ పాడు లోకం.. కిరాతకులా.. మనుషులా? వెంటిలేటర్‌పై ఉన్న యువతిపై అత్యాచారం..

ప్రస్తుత సమాజంలో యువతులు, మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో ఉన్నా, విద్యాభ్యాసం కోసం పాఠశాలకు వెళ్లినా.. చివరకు సుస్తి చేసి ఆస్పత్రి పాలైనా సరే రక్షణ కరవైంది. దీనికి తాజా ఘటనే ఓ మంచి ఉదాహరణ. అనారోగ్యం కారణంగా వెంటిలేటర్‌పై ఉన్న ఓ యువతిపై అఘాయిత్యం జరిగింది. ఈ దారుణం ఢిల్లీ శివారు ప్రాంతమైన గుర్గావ్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుర్గామ్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో 21 ఏళ్ల యువతి శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స కోసం చేరింది. తాను వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపింది. 
 
ఈ ఘటన ఈ నెల 21 నుంచి 27 వతేదీ మధ్య జరిగిందని, స్పృహలోకి వచ్చాక బాధిత యువతి సంఘటన గురించి చెప్పిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. బాధిత యువతి ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
మహేంద్రనగర్ ప్రాంతానికి చెందిన యువతి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ క్షయవ్యాధికి చికిత్స పొందేందుకు ఐసీయూలోని ఓ ప్రైవేటు గదిలో చేరిందని పోలీసులు చెప్పారు. రోగిని కలిసేందుకు వచ్చిన తండ్రికి బాధిత యువతి రాతపూర్వకంగా తెలిపిందని ఏసీపీ ఉషా కుండు చెప్పారు. 
 
ఈ ఘటనపై సుశాంత్ లోక్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 376(2)ఇ కింద కేసు నమోదు చేసి, నిందితుడిని గుర్తించామని ఏసీపీ చెప్పారు. ఈ కేసులో ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వికాస్ అని, తాము ఆసుపత్రి ఉద్యోగులను ప్రశ్నిస్తున్నామని ఏసీపీ వివరించారు. మరోవైపు, ఈ కేసులో పోలీసులకు తాము సహకరిస్తామని ఫోర్టిస్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.