ఎన్సీపీ అధ్యక్ష పీఠం నుంచి శరద్ పవార్‌ను ఎపుడో తొలగించాం : అజిత్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్ష పదవి నుంచి మరాఠా యోధుడు శరద్ పవార్‌ను ఎపుడో తొలగించామని ఆ పార్టీని రెండుగా చీల్చి సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్‌ను ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడో తొలగించామని, ఆయన స్థానంలో తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని తెలిపారు.
శరద్, అజిత్ పవార్ వర్గాలు బుధవారం తమ బలాలు నిరూపించుకునేందుకు పోటాపోటీ సమాశాలు నిర్వహించాయి. జూన్ 30న జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో శరద్ పవార్ స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అజిత్ పవార్‌ను ఎన్నుకుంటూ తీర్మానం జరిగినట్టు ఎన్నికల సంఘానికి బుధవారం సమర్పించిన పిటిషన్‌లో అజిత్ వర్గం పేర్కొంది.
అయితే, అజిత్ వ్యాఖ్యలను శరద్ పవార్ ఖండించారు. జూన్ 30న సమావేశం జరిగినట్టు అజిత్ పవార్ చెబుతున్నప్పటికీ ఆ సమావేశంలో పీసీ చాకో, సుప్రియా సూలే, జయంత్ పాటిల్, ఫౌజియా ఖాన్ తదితర వర్కింగ్ కమిటీ సభ్యులు లేరని, అసలు ఆ సమావేశం గురించి వారికి తెలియదని తెలిపారు.
మరోవైపు, తనకు సీఎం కావాలని ఉందని బాంద్రాలో జరిగిన తన వర్గం ఎమ్మెల్యేల సమావేశంలో అజిత్ పవర్ పేర్కొన్నారు. తాను రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఉప ముఖ్యమంత్రిని అయ్యానని, కానీ బండి అక్కడే ఆగిపోయిందన్నారు. తాను ఈ రాష్ట్రానికి ప్రముఖ్ (సీఎం)ను కావాలని అనుకుంటున్నట్టు మనసులో మాట బయటపెట్టారు.