శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 2 జులై 2023 (18:34 IST)

త్వరలోనే మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి : సంజయ్ రౌత్

ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వర్గం మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరడంపై శివసేన (యూబీటీ) సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ఈ అనూహ్య పరిణామాన్ని ఏక్‌నాథ్‌ షిండే తన సీఎం పదవి కోల్పోవడానికి నాందిగా ఆయన అభివర్ణించారు. త్వరలోనే మహారాష్ట్రకు కొత్త సీఎం వస్తారంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. 
 
ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం మహారాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన విషయం తెలిసిందే. 
 
ఈ పరిణామంపై ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. 'అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం ఏక్‌నాథ్‌ శిందే తన పదవిని కోల్పోయే ప్రక్రియ మొదలైనట్టే.. ఆయన వర్గం ఎమ్మెల్యేలు సభలో అనర్హతకు గురవుతారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా అజిత్‌ పవార్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరారు' అని రౌత్‌ అన్నారు. 
 
ఈ పరిణామాన్ని ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌గా చూడరాదని.. రెండు ఇంజిన్లలో ఒకటి విఫలం కావడంతో వ్యాఖ్యానించారు. అయితే, ఈ పరిణామం గురించి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌కు తెలుసా అని విలేకర్లు ఆయన్ను ప్రశ్నించగా.. ఆయనకు మొత్తం సమాచారం ఉందంటూ రౌత్‌ బదులిచ్చారు.