మీ మరదలికి కరోనా వుందంటూ ముసుగులు ధరించి ఆంబులెన్సులో కిడ్నాప్, ఆచూకి లేదు..

virus mask
శ్రీ| Last Modified శనివారం, 12 సెప్టెంబరు 2020 (16:18 IST)
బృహత్ బెంగళూరు మహానగర్ పాలిక నుంచి వచ్చామంటూ ఓ బృందం బొమ్మనహళ్లిలో కరోనా పరీక్షలు చేసింది. ఆ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిందంటూ ఓ 28 ఏళ్ల యువతిని అంబులెన్స్‌లో తీసుకెళ్లింది. అయితే, నాలుగు రోజులుగా ఆమె సమాచారం లేకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్ 3న పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వ్యక్తులు వచ్చి తమ ప్రాంతంలో కరోనా టెస్టులు నిర్వహించారని, తమతోపాటు ఇరుగుపొరుగువారి నమూనాలను సేకరించారని తెలిపారు బాధితురాలి బావ. కానీ, ఆ తర్వాతి రోజు అంబులెన్స్‌లో ఇద్దరు వ్యక్తులు వచ్చి.. తన మరదలికి కరోనా పాజిటివ్ అని తేలిందంటూ ఆమెను ప్రశాంత్ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పి తీసుకెళ్లారని చెప్పారు. అంతేగాక, ఆమెను తన ఫోన్ కూడా తీసుకెళ్లేందుకు అనుమతించలేదని తెలిపారు.

తమను తర్వాత ఆస్పత్రికి రావాలంటూ చెప్పి వెళ్లారని చెప్పారు. అయితే, తాము ఆస్పత్రికి వెళ్లి ప్రశ్నించగా అలాంటి పేరుతో తమ వద్ద ఏ యువతి అడ్మిట్ కాలేదంటూ ఆస్పత్రి యాజమాన్యం చెప్పారని తెలిపారు. బీబీఎంపీ హెల్ప్‌లైన్ ఫోన్ చేసి సమాచారం అడగ్గా.. తాము అక్కడికి రాలేదని, ఆ ప్రాంతంలో ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తమకు సమాచారం లేదన్నారు.

నాలుగు రోజులైనప్పటికీ తమ మరదలి ఆచూకీ తెలియలేదని ఆమె బావ వికాస్ అన్నారు. కాగా, బాధితురాలి భర్త బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆ యువతిని తీసుకెళ్లిన అంబులెన్స్ బీబీఎంపీది కాదని సంబంధిత అధికారులు చెప్పడం గమనార్హం. ఎస్ఎంఎస్ పంపకుండా తాము రోగులను తీసుకెళ్లమని చెప్పారు.

అంతేగాక, అంబులెన్స్ డ్రైవర్, ఫోన్ నెంబర్ లాంటి వివరాలు ఇచ్చే తీసుకెళ్తామని తెలిపారు. అంతేగాక, తమ అంబులెన్స్‌లన్నింటికీ జీపీఎస్‌తో నడుస్తున్నాయని చెప్పారు. రోగులను తరలిస్తున్నప్పుడు సిబ్బంది ఫొటోలు కూడా తీస్తారని చెప్పారు. ఆ యువతిని ఎవరో ప్రైవేటు అంబులెన్సులో తీసుకెళ్లి ఉంటారని తెలిపారు. యువతిని ఎవరైనా తెలిసినవారే కిడ్నాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :