శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (09:23 IST)

ఆవు దూడను కాపాడబోయి... యూపీలో విషాదం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. బావిలోపడిన ఓ ఆవుదూడను రక్షించబోయిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ మృతివార్త తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గోండా జిల్లాలోని రాజా మొహల్లాలో ఓ పాడు బావిలో ఓ ఆవుదూడ పడిపోయింది. దీనిని రక్షించే క్రమంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బావి పాడుబడటంతో గ్రామస్థులు దాంట్లో చెత్త వేసేవారు. 
 
ఈ బావిలో మంగళవారం ఓ లేగదూడ పడిపోయింది. గమనించిన ఓ వ్యక్తి దానిని రక్షించేందుకు నిచ్చెన వేసుకుని బావిలోకి దిగాడు. కిందికి దిగిన వ్యక్తి బావిలో వెలువడిన విషవాయువు పీల్చి స్పృహ కోల్పోయాడు. దీంతో ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు అందులో దిగిన మరో నలుగురు కూడా విషవాయువుల కారణంగా స్పృహతప్పిపోయారు.
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక, మునిసిపాలిటీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.