గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 6 ఏప్రియల్ 2017 (12:32 IST)

టీచర్లూ... నో జీన్స్ ప్లీజ్... యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్

ప్రజా మద్దతు తమవైపే ఉందని, ప్రత్యర్థులు తమవైపు తొంగి చూడటానికి కూడా సాహసించలేరని విర్రవీగిన ప్రతి పాలకుడూ ప్రజామద్దతు రివర్స్ అయినప్పుడు మట్టిగొట్టుకుపోయారు.. మనదేశంలో చాలామంది పాలకులకు ఇది అనుభవమే..

ప్రజా మద్దతు తమవైపే ఉందని, ప్రత్యర్థులు తమవైపు తొంగి చూడటానికి కూడా సాహసించలేరని విర్రవీగిన ప్రతి పాలకుడూ ప్రజామద్దతు రివర్స్ అయినప్పుడు మట్టిగొట్టుకుపోయారు.. మనదేశంలో చాలామంది పాలకులకు ఇది అనుభవమే.. ఉత్తర ప్రదేశ్‌లో అపూర్వ ప్రజాబలంతో నెగ్గి అధికారంలోకి వచ్చిన బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాధ్‌కు ఈ పాఠం ఇంకా తలకెక్కినట్లు లేదు. కేవలం పదిరోజుల పాలనలో నిషేధాల మీద నిషేధాలు విధించుకుంటూ పోతున్న యోగి ప్రభుత్వానికి అవి ప్రజల్లో వెగటు పుట్టిస్తున్నాయన్న వాస్తవం బోధపడినట్లు లేదు.
 
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర చోట్ల పాన్‌ మసాలా, గుట్కాలను నమలడం, పొగతాగడాన్ని యోగి నిషేధించారు. దీనికి యావత్ ప్రజానీకం స్వచ్చంద మద్దతు పలికారు. వాటిని అమ్మే వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వానికి ఉన్న ప్రజామద్దతు  బలం కారణంగా నోరెత్తలేకపోయారు. ఆ తర్వాత అక్రమ కబేళాలపై నిషేధం పేరుతూ చట్టబద్ధంగా కూడా గొడ్డుమాంసం అమ్మాలంటేనే వ్యాపారులు భయపడే వాతావరణం తీసుకొచ్చారు. మెజారిటీ హిందూ జనాభా దీనికీ మద్దతు పలికింది. 
 
కానీ మాంసవ్యాపారం, తోళ్ల వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయల మార్కెట్‌తో ముడిపడి ఉన్నందువల్ల తొలి రోజునుంచే దీనిపట్ల నిరసన కూడా బలంగానే వచ్చింది. చివరకు రెండు వారాలు కాకముందే యోగి ప్రభుత్వం కోర్టుచేత మొట్టికాయలు వేయించుకోవలసి వచ్చింది. ఎక్కడెక్కడ చిన్న చిన్న మాంస వ్యాపారుల వృత్తిని గొడ్డుమాంసం నిషేధం పేరిట దెబ్బతీశారా వారందరికీ పదిరోజుల్లోగా పరిహారం, పరిష్కారం ఏర్పాటు చేయాలని యూపీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇది యోగికి పాలకుడిగానే కాకుండా వ్యక్తిగా కూడా ఝలక్కే మరి. 
 
తాజాగా ప్రభుత్వ, ప్రభుత్వ సాయంతో నడిచే కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఇకపై  జీన్స్, టీ–షర్ట్‌లు వేసుకుని విధులకు హాజరవ్వరాదంటూ యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వస్త్రధారణ పద్ధతిగా, విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులకు ఎలాగూ యూనిఫాం ఉంటుందనీ, ఉపాధ్యాయుల వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉంటే, విద్యార్థులు వారిని అనుసరిస్తారని ఉన్నత విద్యా శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
 
ఉపాధ్యాయుల వస్త్రధారణ సరిగా ఉండాలని చెప్పడం వరకు మంచి విషయమే..  కానీ విదేశీ వస్త్రాలను, విదేశీ సంస్కృతిని అమెజాన్, వాల్ మార్ట్‌ల సాక్షిగా విచ్చలవిడిగా ఆహ్వానించిన ప్రభుత్వాలు, వాటిని మరింత పీక్ స్టేజ్‌కి  తీసుకెళుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిజంగానే జీన్స్, టీ షర్టుల ధారణపై నిషేధం అమలు చేయగలదా? కొన్ని వేలమంది టీచర్లు అధ్యాపకులు ఆధునిక వస్త్రాలు ధరించకూడదని నిషేధం పెడితే  ఇప్పటికే మన వస్త్ర మార్కెట్‌పై పట్టు సాధించిన  విదేశీ వ్యాపార సంస్థలు ఊరకే ఉంటాయా. 
 
అందుకే సమస్య మూలాల్లోకి పోకుండా పైపై పూత మెరుగుల పట్ల ఆర్బాటం చేసుకుంటే పోతే శతకోటి పాలకులలో యోగి కూడా ఒకరయ్యే ప్రమాదం ఉంది. ఇలాగే మిడిమాలంగా వ్యవహరించి తెలంగాణలో అధికార గర్వం ప్రదర్శించి అతి చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కోర్టుల మొట్టికాయలతో తల బొప్పి కట్టి సైలెంట్ అయిపోయారు. మరి యూపీ సీఎం విషయంలో ఇది ఎలా వుంటుందో చూడాలి.