మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జులై 2021 (19:03 IST)

మాజీ భార్య సవతి తల్లి ఎలా అయింది?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. మాజీ భార్య ఒకరు సవతి తల్లి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత తేరుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని బడాన్‌కు చెందిన మైనర్లు అయిన జంటకు గత 2016లో వివాహం జరిగింది. ఆరు నెలల తర్వాత వారిద్దరు విడిపోయారు. 
 
మేజర్‌ అయిన తర్వాత కలిసి ఉండేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించగా ఆ యువతి నిరాకరించింది. అతడ్ని తాగుబోతుగా ఆరోపించి విడాకులు డిమాండ్‌ చేసింది.
 
మరోవైపు పారిశుధ్య కార్మికుడిగా పని చేసే ఆ వ్యక్తి తండ్రి కొంత కాలంగా అతడికి డబ్బులు ఇవ్వడం లేదు. ఆయన సంభల్‌లో విడిగా ఉంటున్నాడు. దీంతో ఆ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా తన 48 ఏండ్ల తండ్రి గురించి సమాచారం కోరాడు. 
 
ఇందులో తన మాజీ భార్యను తండ్రి పెండ్లి చేసుకున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. దీనిపై బిసౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం ఇరు వర్గాలను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. 
 
కాగా, సవతి తల్లిగా మారిన మాజీ భార్య మొదటి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అతడి తండ్రిని పెండ్లి చేసుకున్న తాను సంతోషంగా ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.