శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి.. ఎక్కడ?
సమాజంలో కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారు. ఇలాంటి వారిలో పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా ఉంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ఓ యువతి ఉండగా, ఈమె శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకుంది. ఇందుకు ఆమె తల్లిదండ్రులు కూడా అనుమతి ఇవ్వడం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ఔరేయా జిల్లాలో జరిగింది.
ఈ యువతికి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిపై అమితమైన భక్తితో పాటు ప్రేమ కూడా ఉండేది. దీంతో శ్రీకృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. పైగా, ఈ వివాహాన్ని ఆ యువతి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఔరేయా జిల్లాలోని బిధువా పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రంజత్ సింగ్ సోలంకి కుమార్తె రక్షా సోలంకి (30) అనే యువతి పీజీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఎల్ఎల్బీ చేస్తుంది.
ఈమెకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిపై అమితమైన భక్తి, ప్రేమను పెంచుకుంది. దీంతో ఆయన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తేరుకుని కుమార్తె అభిప్రాయానికి విలువనిస్తూ ఈ వివాహానికి ఏర్పాట్లు చేశారు. కుమార్తె ఇష్ట ప్రకారం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకునేందుకు సమ్మతించారు.
ఈ పెళ్లికి ఘనమైన ఏర్పాట్లుచేశారు. ముహూర్త సమయానికి వధువు శ్రీకృష్ణుడి విగ్రహంతో మండపంలోకి ప్రవేశించి, సరిగ్గా వేదపండితులు నిర్ణయించిన ముహూర్త సమయానికి శ్రీకృష్ణుడి మెడలో ఆ యువతి తాళి కట్టింది. ఆ రాత్రంతా జరిగిన ఈ వివాహ వేడుక తర్వాత అప్పగింతల కార్యక్రమం కూడా జరిగింది. ఆ తర్వాత వధువు తన భర్తగా భావించిన శ్రీకృష్ణుడు విగ్రహంతో సుక్‌చైన్‌పూర్ గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది.