మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 3 మే 2018 (10:38 IST)

తాగొచ్చి నాకు తలకొరివి పెట్టకు.. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది.. ఇకనైనా?

తల్లి మరణించింది. తాగుబోతు తండ్రిని మార్చాలనుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నా.. తండ్రి తాగుడును వదిలిపెట్టలేదు. రోజూ తాగడం... ఎవరితోనైనా గొడవ పెట్టుకోవడం తండ్రి పనైపోయింది. తండ్రి బాగోతాన్ని ఐదేళ్ల ప

తల్లి మరణించింది. తాగుబోతు తండ్రిని మార్చాలనుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నా.. తండ్రి తాగుడును వదిలిపెట్టలేదు. రోజూ తాగడం... ఎవరితోనైనా గొడవ పెట్టుకోవడం తండ్రి పనైపోయింది. తండ్రి బాగోతాన్ని ఐదేళ్ల పాటు భరించిన ఆ కుమారుడు.. ఇక లాభం లేదనుకున్నాడు. తండ్రి తన మరణంతోనైనా మారుతాడనుకున్నాడు. అంతే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
ఆత్మహత్యకు ముందు అతను రాసిన లేఖ కంటతడి పెట్టించేదిగా వుంది. ఇంటర్ పూర్తి చేసి నీట్‌కు సిద్ధమవుతున్న ఆ కుర్రాడు.. తాగుబోతు తండ్రి దాష్టికానికి తీవ్రంగా కుమిలిపోయాడు. తన చావుతోనైనా తండ్రిలో మార్పు వస్తుందని భావించాడు. అంతే ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా గురుకుల్‌పట్టి గ్రామానికి చెందిన మాడసామి, ఈశాకి అమ్మాళ్‌ కుమారుడు దినేశ్‌ నల్లశివన్‌ (17). ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసిన దినేశ్ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. తొమ్మిదేళ్ల క్రితమే.. తల్లి మృతి చెందడంతో అప్పటి నుంచే అతనికి కష్టాలు మొదలయ్యాయి. తండ్రి తాగుడుకు బానిసయ్యాడు. రెండో పెళ్లి చేసుకున్నా అతడిలో ఎలాంటి మార్పు లేదు. అంతే దినేశ్ లేఖ రాశాడు. 
 
''నాన్నా.. నా చావుతోనైనా నీలో మార్పు వస్తుందనుకుంటాను. ఇకనుంచైనా తాగుడు మానేయ్‌. కనీసం నా శవానికి తలకొరివి పెట్టేందుకైనా నువ్వు మద్యం తాగకుండా వస్తావనుకుంటున్నా. తలకొరివి కూడా తాగి పెట్టేపనైతే.. దయచేసి నా అంత్యక్రియలకు రాకు. అప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది'' అంటూ దినేశ్ రాసిన లేఖ పలువురిని కంటతడి పెట్టించింది. 
 
తండ్రికే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మద్యం షాపులను మూసేయాలని దినేశ్ విజ్ఞప్తి చేశాడు. ఇకనైనా తమిళనాడులో మద్యం షాపులను మూసేయకపోతే నా ఆత్మనే వాటిని ధ్వంసం చేస్తుందని దినేశ్ లేఖలో పేర్కొన్నాడు.