కటిక పేదరికం భరించలేక.. ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాన్‌పూర్ బద్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కటిక పేదరికం భరించలేక ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 16, 14, 11 యేళ్ళ వయస్సున్న అక్కా చెల్లెళ్లకు గణేష్ అనే సోదరుడు ఉన్నాడు.
వీరి తండ్రి తొమ్మిదేళ్ళ క్రితం మరణించాడు. తల్లి జీవించివుండగా, ఆమెకు మూడేళ్ళ క్రితం కంటి చూపు పోయింది. దీంతో ఆ నలుగురు పిల్లలు దొరికిన పనల్లా చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి ఫట్టుపూర్ దగ్గర సుల్తాన్ పూర్ రైల్వే క్రాసింగ్ జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి వారు ఆత్మహత్య చేసుకున్నారు. కటిక పేదరికాన్ని భరించలేక వీరంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
గురువారం సాయంత్రం ఇంటి నుంచి కలిసివెళ్లిన ముగ్గురు ఆడపిల్లలు రాత్రి 11 గంటలకు ఫట్టుపూర్ వద్ద విగతజీవులుగా మారారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.