బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (11:58 IST)

ముగిసిన నిశ్చితార్థం.. కాబోయే భర్త వేధింపులు తాళలేక...

ఆ యువతికి నిశ్చితార్థం ముగిసింది. ఆ తర్వాత కాబోయే భర్త తన క్రూరత్వాన్ని చూపించసాగాడు. అతని వేధింపులు తాళలేక ఆ యువతి పెళ్లికి ముందే తనువు చాలించింది. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని హుబ్బళ్లి ప్రశాంత నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రశాంత నగరకు చెందిన పవిత్రా పాటిల్‌ హావేరికి చెందిన అభినందన్‌ అనే యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. డిసెంబరు 2న వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. ఇటీవలే వీరిద్దరూ దాండేలికి విహారయాత్రకు వెళ్లి అనేక ఫొటోలు తీసుకున్నారు. 
 
అప్పటి నుంచి అభినందన్‌ అనేక అనుమానాలు పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని అనుమానంగా చూడడమే కాకుండా పవిత్రా పాటిల్‌ను వేధించేవాడని ఆరోపించారు. ఈ వేధింపులను తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అశోక్‌ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.