జుట్టుతో కాసులే కాసులు... హెయిర్‌తో అమినో యాసిడ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జుట్టు (వెంట్రుకలు) కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకాలం బార్బర్ షాపుల్లో పోగయ్యే వెంట్రుకలకు చెత్త డబ్బాల్లో పడేశారు. కానీ, ఇకపై అలాంటి పరిస్థితి లేదు. ఆ వెంట్రుకలను కొనుగోలు చేసేందుకు సర్కారు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఒక కేజీకి రూ.40 చొప్పున పైసలు చెల్లించనున్నారు. ఈ వెంట్రుకలను ఉపయోగించి అమినో యాసిడ్స్ తయారు చేయనున్నారు. ఈ డీల్‌కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే,
కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యూపీలోని 'భారతీయ హరిత్ ఖాదీ గ్రామ ఉద్యోగ్సంస్థాన్' (బీహెచ్‌కేజీఎస్) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. జుట్టును, ఆవు మూత్రం, పేడతో కలిపి అమైనో యాసిడ్‌ను తయారు చేస్తారని బీహెచ్ కేజీఎస్ ప్రతినిధులు చెప్పారు. దీనికోసం ఇప్పటికే ఖాదీ బోర్డు, గ్రామ ఉద్యోగ్ మధ్య ఒప్పందం కుదిరిందని ఖాదీ గ్రామ ఉద్యోగ మినిస్టర్ సత్యదేవ్ చెప్పారు.
ఈ ప్రణాళికలో భాగంగా, మార్చి మొదటి వారంలో 10 పట్టణాల్లో కలెక్షన్ సెంటర్లను ఏర్పాటుచేసి బార్బర్ల నుంచి జుట్టును కొంటామని అధికారులు చెప్పారు. అమినో యాసిడ్ తయారీకి సంబంధించి రెండు సంవత్సరాల పాటు రీసెర్చ్చేశామని, దీన్ని తయారు చేసేందుకు జుట్టు సరైన ముడి పదార్థంగా గుర్తించాని బీహెచ్ కేజీఎస్ ట్రైనింగ్ ప్రోగ్రామర్ విజయ్ రాయ్ అన్నారు. జుట్టుతో తయారు చేసిన అమినో యాసిడ్ ధర లీటర్‌కు రూ.150గా నిర్ణయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 కేజీల జుట్టును వృధాగా పడేస్తున్నారనీ, ఈ పథకం ద్వారా బార్బర్లకు మరింత ఆదాయం పెరుగుతుందని నాయీ బ్రాహ్మణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.