ఉత్తరప్రదేశ్ : 178 యూనిట్లకు రూ.23 కోట్ల విద్యుత్ బిల్లు.. బిత్తరపోయిన యజమాని
ఉత్తరప్రదేశ్ విద్యుత్ బోర్డు ఓ గృహ వినియోగదారుడుకి తేరుకోలేని షాకిచ్చింది. అతనికి రూ.23 కోట్ల విద్యుత్ బిల్లును చేతికిచ్చాడు. ఆ బిల్లును చూసిన ఆ యజమాని బిత్తరపోయాడు. తన జీవితాంతం శ్రమించినా అంత మొత్తం సంపాదించి చెల్లించలేనని వాపోయాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని కన్నౌజ్‌లో అబ్దుల్ బాసిత్ అనే వ్యక్తి ఇంటికి 2 కిలోవాట్‌ల సామర్థ్యం కలిగిన కరెంట్ కనెక్షన్‌ను ఉపయోగిస్తున్నాడు. ఈయన గత నెలలో 178 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాడు. ఇందుకోసం అతనికి విద్యుత్ శాఖ అధికారులు పంపిన బిల్లు విలువ రూ.23,67,71,524.
ఈ ఘటనపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాదాబ్ అహ్మద్ స్పందిస్తూ, ఈ విద్యుత్ బిల్లుపై విచారణ చేయిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా అప్పుడప్పుడు అధిక మొత్తంలో బిల్లు జనరేట్ అవుతుంటాయనీ, ఈ తప్పిదాన్ని సరిచేసిన తర్వాతే వినియోగదారుడు కరెంట్ బిల్లు చెల్లించొచ్చు అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెల్లడించారు.