మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (20:38 IST)

లాక్‌డౌన్ '1.0'లో సాధించిన ఫలితాల రక్షణ కోసమే '2.0' : వెంకయ్య నాయుడు

లాక్‌డౌన్ 1.0లో సాధించిన ఫలితాలను రక్షించుకోవడం కోసమే 2.0ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను వచ్చే నెల మూడో తేదీ వరకు పొడగించిన విషయం తెల్సిందే. ఈ నిర్ణయాన్ని అనేక మంది స్వాగతిస్తున్నారు.
 
తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఇదే అంశంపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని కొనియాడారు.
 
లాక్‌డౌన్ 1.0లో సాధించిన ఫలితాలను కాపాడుకోవడానికి లాక్‌డౌన్ (2.0) కొనసాగించాలని అన్నారు. లాక్‌‌డౌన్ 2.0 నుంచి ఆశించిన ఫలితాలు సాధించడమనేది ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. 
 
కరోనా వైరస్ మహమ్మారిని పారదోలేందుకు, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ మరింత నిబద్ధతతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరీక్షా సమయంలో మనం చేస్తున్న పోరాటంపైనే లాక్‌డౌన్ ఎత్తివేత ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
 
ఆర్థికంగా, దుర్భరమైన వర్గాల జీవనోపాధి గురించి జాగ్రత్తలు తీసుకుంటానని ప్రధాని హామీ ఇచ్చారని, రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం అవసరమైన చర్యలను కూడా తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. మెరుగైన భవిష్యత్ కోసం కొన్ని కష్టాలు భరించక తప్పదని ఉపరాష్ట్రపతి చెప్పుకొచ్చారు.