శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (12:57 IST)

లాక్‌డౌన్ పొడగింపు .. మే 3 వరకు రైళ్లు బంద్.. 100 శాతం వాపస్

ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను వచ్చే నెల మూడో తేదీ వరకు పొడగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. అంటే ఇపుడున్న పరిస్థితే అప్పటివరకు కొనసాగనుంది. అయితే, ఈ నెల 20వ తేదీ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరిపి లాక్‌డౌన్ నిబంధనలను సడలించే అవకాశం ఉన్నట్టు తెలిపారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనతో రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మూడో తేదీ వరకు అన్ని రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. మే 3 వరకూ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన కాసేపటికే రైల్వే ఈ స్పష్టత ఇచ్చింది. 
 
అన్ని రకాల ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, మెట్రో రైల్ సర్వీసులను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తొలివిడత( ఏప్రిల్ 14) తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమౌతాయని అంతా ఆశించారు. 
 
రైల్వే అనుమతించడంతో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు కూడా కొన్నారు. అయితే మే 3 వరకూ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు గతంలో రిజర్వ్ చేసుకున్న టిక్కెట్లకు వంద శాతం డబ్బు తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు.