శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (20:35 IST)

ఆంధ్రాలో లాక్‌డౌన్ పొడగింపు... రెడ్‌జోన్స్‌లో కఠిన ఆంక్షలు : మంత్రి పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడగించే అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్ని నాని సూచన ప్రాయంగా వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన స్పందిస్తూ, రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ మరికొంతకాలం పొడగించే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. అలాగే, కరోనా వైరస్‌లకు స్పాట్‌లుగా ఉన్న రెడ్‌జోన్ ఏరియాల్లో ఆంక్షలను మరింతగా అమలు చేయనున్నట్టు తెలిపారు. 
 
అంతేకాకుండా, రాష్ట్రంలో వైరస్ బారినపడిన వారి వివరాలను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా లెక్కల గురించి వాస్తవాలను ప్రభుత్వం దాస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన తిప్పికొట్టారు. 
 
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్‌లో దాక్కుని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. 
 
ఇకపోతే, రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 28,622గా ఉందన్నారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌గా వచ్చారని తెలిపారు. మిగిలిన వారిని నిర్బంధ పర్యవేక్షణలో ఉంచామన్నారు. 14 రోజుల హోం క్వారంటైన్ పూర్తి కావొచ్చిందని చెప్పారు. 
 
అదేవిధంగా, మర్కజ్ వెళ్లొచ్చి కరోనా బారినపడినవారిలో 196 మంది ఉన్నారని, వీళ్లందరూ చికిత్స పొందుతున్నారని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 6175 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని, వాళ్లందరిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉందని మంత్రి పేర్ని నాని వివరించారు.