శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (17:01 IST)

లాక్‌డౌన్ పొడగించాలంటున్న రాష్ట్రాలు ... సందిగ్ధంలో కేంద్రం

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కేసుల నమోదు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 14వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడగించాలని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేంద్రం సందిగ్ధంలోపడింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయినా కరోనా కేసుల నమోదు మాత్రం ఆగడం లేదు. కేవలం కొన్నిరోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపైంది. ఈ నేపథ్యంలో, లాక్‌డౌన్ మరికొన్నిరోజులు పొడిగించాలని అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 
 
కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. అయితే ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తుండటం, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం రాష్ట్రాలను కలవరపాటుకు గురిచేస్తోంది.
 
ఈ దశలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే తీవ్రనష్టం తప్పదని తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అందుకే లాక్‌డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. 
 
లాక్‌డౌన్ పొడిగింపుపై రాష్ట్రాలను నుంచే కాకుండా మేధావుల నుంచి కూడా వినతులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా, సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రధాని మోడీ దీర్ఘకాల పోరాటానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రులకు సూచన ప్రాయంగా వెల్లడించినట్టు చెప్పారు. 
 
ఇటు రాష్ట్రాలు కూడా విజ్ఞప్తులు చేస్తుండటంతో, కేంద్రం లాక్‌డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలంటున్నాయి. మరోవైపు, ఈ వారాంతంలో జరిగే మంత్రివర్గంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.