గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (14:21 IST)

లాక్‌డౌన్‌ను పొడగిస్తారా? లేదా? మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారు?

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. మొత్తం 21 రోజుల పాటు ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ లాక్‌డౌన్‌ను పొడిగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో ఏప్రిల్‌ 14 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగించాలని డిమాండ్లు వస్తున్నాయనీ, కేంద్రం కూడా లాక్‌డౌన్‌ పొడిగింపు అంశంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ మేధావులతో మాట్లాడుతున్నారని కిషన్‌ రెడ్డి తెలిపారు.
 
'ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ విపత్కర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించాలన్న విషయంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు' అన్నారు. 
 
'మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని మోడీ మాట్లాడారు. దేశంలో ఉన్న పరిస్థితులను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పవర్‌ పాయింట్‌ ద్వారా పలు అంశాలు వివరిస్తూ దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో కూడా త్వరలో మాట్లాడబోతున్నాం' అని కిషన్‌ రెడ్డి తెలిపారు.