సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:30 IST)

లాక్‌డౌన్ వేళ బిలియనీర్ అయిన భారతీయుడు ఎవరు?

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ప్రపంచ మార్కెట్లన్నీ స్తంభించిపోతున్నాయి. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. శ్రీమంతులు సంపద హరించుకుపోతోంది. దీనికి కారణం కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ పకడ్బంధీగా అమలు చేస్తున్నాయి. అలాంటి లాక్‌డౌన్ వేళ ఓ భారతీయుడు ఏకంగా బిలియనీర్ అయ్యాడు. ఆయన ఎవరో కాదు.. రాధాకిషన్ ధమాని. అవెన్యూ సూపర్ మార్ట్ (డీమార్ట్) అధినేత. 
 
ఈ యేడాది ఆయన సంపద 50 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫలితంగా మన దేశంలో టాప్ 12 శ్రీమంతుల్లో ఆయన ఒకరు. ఈయన ఒక్కరి సంపద మాత్రమే భారీగా పెరిగింది. ఈ యేడాది డీమార్ట్ షేర్ విలువ ఏకంగా 18 శాతం పెరిగింది. ఈ విషయన్ని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.
 
ఇకపోతే, ధమానీ జీవితం, ఆయన పడిన కష్టాలు, వ్యాపారంలో ఆయన ఎదిగిన తీరును పరిశీలిస్తే, ముంబైలో ఓ సింగిల్ రూమ్ అపార్ట్‌మెంట్‌లో ఆయన తన వ్యాపారాన్ని ప్రారంభించారు. అలా అంచలంచెలుగా ఎదుగుతూ దేశ వ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. 
 
కరోనా వైరస్ నేపథ్యంలో తన పోటీదారులైన ముఖేశ్ అంబానీ, ఉదయ్ కొటక్‌లు ఇబ్బందులు పడ్డా... ధమానీ మాత్రం లాభాల్లో దూసుకుపోయారు. కరోనా భయాల నేపథ్యంలో... ప్రజలంతా నిత్యావసర సరుకుల కోసం మార్టులకు క్యూ కట్టడంతో... సంక్షోభ సమయంలో కూడా ఈయన వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగింది. దీంతో సంస్థ షేర్ల విలువ కూడా భారీగా పెరిగింది.
 
వినియోగదారులకు ఇతర స్టోర్ల కంటే తక్కువ ధరలకు సరుకులను అందించడమే డిమార్ట్ వ్యాపార రహస్యం. మధ్య తరగతి ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా ధరలు ఉండటంతో... డిమార్ట్ స్టోర్లు అనునిత్యం కస్టమర్లతో కళకళలాడుతుంటాయి. కరోనా భయాల నేపథ్యంలో, నిత్యావసరాల కొరత ఉంటుందేమోనన్న సందేహాలతో జనాలు డిమార్ట్ స్టోర్లకు వెల్లువెత్తారు. దీంతో, డిమార్ట్ స్టోర్లు భారీ ఎత్తున బిజినెస్ చేశాయి. దేశ వ్యాప్తంగా 1300 డిమార్ట్ స్టోర్లు ఉన్నాయి. మన దేశంలో రెండో అతిపెద్ద రీటెయిల్ చైన్ డిమార్ట్ కావడం గమనార్హం.