బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (09:07 IST)

మరో వివాదంలో సిద్ధరామయ్య.. సీఎంకు చెప్పులు తొడిగిన వ్యక్తిగత సహాయకుడు

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. గత కొంత కాలంగా అనేక వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన.. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడితో బూట్లు తొడిగించుకున్నారు. ఆదివారం మైసూర్‌లో జరిగిన ఓ కార

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. గత కొంత కాలంగా అనేక వివాదాల్లో చిక్కుకుంటున్న ఆయన.. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడితో బూట్లు తొడిగించుకున్నారు. ఆదివారం మైసూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. 
 
శుక్రవారం రాత్రి మైసూర్‌లో సీనియర్ నటుడు చేతన్ రామారావు మృతిచెందారు. ఆదివారం సీఎం సిద్ధరామయ్య మైసూర్‌లోని చేతన్ రామారావు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన ఇంటి నుంచి బయటకు వస్తూ గుమ్మం దగ్గర ఆగారు. కొద్ది సేపట్లోనే సీఎం వ్యక్తిగత సహాయకుడు కుమార్ అక్కడికి చేరుకున్నాడు. షూ తీసుకువచ్చి సీఎంకు తొడిగి, లేస్ కూడా కట్టారు. 
 
కానీ, సీఎం సిద్ధరామయ్య ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆయనతోపాటు ఉన్న ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ సీఎం వ్యక్తిగత సహాయకుడు ఇలా చేయడం చాలా అరుదన్నారు. సీఎం సిద్ధరామయ్య అహంకారి, బూటకపు సామ్యవాది అని బీజేపీ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీటీ రవి దుయ్యబట్టారు. వ్యక్తిగత సహాయకుడితో షూ తొడిగించుకోవడం నీచమైన చర్య అని ట్వీట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో సీఎం సిద్ధరామయ్య ఖరీదైన వాచ్‌ను బహుమతిగా పొందడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.