వంతెన కింద ఇరుక్కున్న విమానం.. అసలు ఏం జరిగిందంటే?
బీహార్‌లో ఓ ఆశ్చర్యకర సంఘటన ఒకటి జరిగింది. విమానాన్ని మోసుకెళుతున్న లారీ ఒకటి వంతెన కింద చిక్కుకుని పోయింది. దీంతో ఆ మార్గంలో రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారణ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ముంబై నుంచి అస్సాంకు విమానాన్ని తీసుకెళుతున్న ట్రక్కు పిప్రాకోఠి వద్ద ఫ్లైఓవర్ కింద చిక్కుకుని పోయింది. విమానం పైభాగం వంతెనకు తాకడం వల్ల లారీ ఆగిపోయింది. వాహనాన్ని ముందుకు పోనిచ్చేందుకు డ్రైవర్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. ఫలితంగా 28వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విమానం ఇరుక్కుందున్న విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ముంబైలో నిర్వహించిన ఓ వేలంలో ఓ వ్యాపారి విమానాన్ని తుక్కు కింద కొనుగోలు చేశఆరు. దాన్ని ముంబై నుంచి అస్సోంకు తరలిస్తుండగా, ఈ వంతెన కింద చిక్కుకునిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ట్రక్కును చాకచక్యంగా బయటకు తీశారు. టైర్లలో కొంతమేరకు గాలిని తీసేయడంతో లారీ ఎత్తు తగ్గిపోయింది. దీంతో లారీ సులభంగా బయటకు వచ్చింది.