బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (14:53 IST)

విమానంలో ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని చితకబాది.. అర్థనగ్నంగా తిరుగుతూ..

vistara
ఇటీవలికాలంలో విమాన ప్రయాణికులు చేష్టలు ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా మారుతున్నాయి. కొందరు శృతిమించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వీరి చేష్టలు రోత పుట్టిస్తున్నాయి. తాజాగా ఓ విమాన ప్రయాణికురాలు వీరంగం సృష్టించారు. సిబ్బందిని చితకబాది, అర్థనగ్నంగా తిరుగుతూ, బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. దీంతో విమానం నుంచి బలవంతంగా కిందకు దించేసిన సిబ్బంది ఆమెను పోలీసులకు అప్పగించారు. ఈ మహిళ ప్రయాణికురాలు వయసు 45 యేళ్లు. ఇటలీ దేశస్థురాలు. 
 
జనవరి 30వ తేదీ సోమవారం అబుదాబి నుంచి ముంబైకు విస్తారా ఎయిర్‌లైన్స్ వచ్చింది. ఈ విమానంలో ముంబైకు వచ్చిన ఆ మహిళ ఎకానమీ జర్నీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. అయితే, తాను బిజినెస్ క్లాస్‌లోనే కూర్చొంటానని పట్టుబట్టింది. దీనికి సిబ్బంది అంగీకరించలేదు. దీంతో వారితో వాగ్విదానికి దిగి, వారిపై దాడి చేసింది. 
 
అంతటితో ఆగకుండా విమానంలో అర్థనగ్నంగా అటూఇటూ తిరుగుతూ నానా రచ్చ చేసింది. సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో కెప్టెన్ వార్నింగ్ కార్డు జారీ చేశారు. ఆ తర్వాత విమాన సిబ్బంది అమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. విమానం ల్యాండ్ కాగానే ఆమెను అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత ముంబై ఎయిర్‌పోర్టు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 
 
"ప్రయాణికురాలి అసభ్య, హింసాత్మక ప్రవర్తన కారణంగా ఆమెను అదుపులోకి తీసుకువాల్సి వచ్చింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఘటన గురించి ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చాం. వారు తగిన చర్యలు తీసుకున్నారు" అని విస్తారా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.