మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 అక్టోబరు 2020 (13:17 IST)

కమలనాథులకు బానిసలమా? ఆ ఒక్కదానికోసమే స్నేహం : అన్నాడీఎంకే

తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే నేతలకు ధైర్యం వచ్చింది. వచ్చే యేడాది మే నెలతో వారి పదవీ కాలం ముగియనుంది. అంటే, 2021, మే నెలలో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అన్నాడీఎంకే నేతలు బీజేపీ పెద్దలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా, కమలనాథులకు తాము బానిసలంకామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని నిర్ణయించడం తమ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. పైగా, తాము ఎంపిక చేసే అభ్యర్థికి మద్దతు ఇచ్చే పార్టీలతోనే తాము స్నేహం కొనసాగిస్తామని తెలిపారు. అదేసమయంలో కేవలం నిధుల కోసమే బీజేపీతో స్నేహం చేస్తున్నట్టు వారు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలను ముఖ్యంగా, అన్నాడీఎంకేను బీజేపీ తమ గుప్పెట్లో పెట్టుకుని, అనధికార పెత్తనం చేస్తోంది. అధికారంలో ఉన్నది పేరుకు అన్నాడీఎంకే అయినప్పటికీ... కమలనాథుల కనుసన్నల్లో ఈ పాలన సాగుతోంది. దీంతో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ నియంత్రిస్తోందనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అన్నాడీఎంకే పాలన బీజేపీ కనుసన్నల్లోనే సాగుతోందని కూడా కొందరు చెపుతుంటారు. 
 
ఈ నేపథ్యంలో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే ఆయన అభ్యర్థిత్వం పట్ల బీజేపీ అసంతృప్తిగా ఉందనే కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అన్వర్ రాజా మాట్లాడుతూ, సీఎం అభ్యర్థి ఎంపిక తమ అంతర్గత వ్యవహారమన్నారు. 
 
ఇందులో ఎవరూ జోక్యం చేసుకునే అవకాశం లేదని అన్నారు. బీజేపీకి అన్నాడీఎంకే బానిస కాదని చెప్పారు. కేంద్రంతో సఖ్యంగా ఉన్నంత మాత్రాన అది బానిసత్వం కాదని అన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను పొందేందుకే కేంద్రంతో తాము సన్నిహితంగా ఉంటామని చెప్పారు. పళనిస్వామి అభ్యర్థిత్వాన్ని అంగీకరించే పార్టీలతోనే తాము పొత్తు పెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.